Medak: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్ రావు ఘాటు కౌంటర్!
Medak: అచ్చంపేట ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు.
Medak: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్ రావు ఘాటు కౌంటర్!
Medak: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని దుష్ట చతుష్టయం నుంచి కాపాడాల్సిన అవసరం ఉందంటూ ప్రధాని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని పలు ప్రశ్నలతో నిలదీశారు. నిజంగా వారు దుష్ట చతుష్టయమే అయితే నెలకోసారి ఢిల్లీకి వెళ్లి ఎవరికి వంగి వంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు.
అదానీతో సమావేశాలు నిర్వహించారా లేదా? ఆయనను హైదరాబాద్‌కు పిలిచి భోజనం పెట్టారా లేదా? రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలని ఎందుకు ఆహ్వానిస్తున్నారని నిలదీశారు. అదానీ దుష్ట చతుష్టయంలో ఒకరైతే ఆయనతో మీకున్న సంబంధాలేంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ మూడుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారని, దేశంలో మీలాంటి వారు 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీని బడేభాయ్గా, తనను చోటేభాయ్గా రేవంత్ రెడ్డి అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు అదే ప్రధాని గురించి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవలేని పరిస్థితి ఉందన్నారు. గ్రామపంచాయతీలకు అభివృద్ధి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కళ్లుండి చూడలేని కబోధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ గెలిచారని, చేవెళ్లలోనూ బీజేపీ విజయం సాధించిందని, ఆయన సొంత జిల్లా పాలమూరులో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచారని గుర్తుచేశారు.
కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి రాజకీయ సమాధానం చెప్పారని అన్నారు. తెలంగాణలో బీజేపీ లేదని ఎలా చెబుతారని ప్రశ్నిస్తూ, అవసరమైతే కంటి పరీక్షల కోసం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి లేదా ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లాలని ఎద్దేవా చేశారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లాలోనే 41 మంది సర్పంచులు, 49 మంది ఉపసర్పంచులు బీజేపీ మద్దతుతో గెలిచారని పేర్కొన్నారు. కావాలంటే సిద్దిపేట కలెక్టర్‌ను అడిగి తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి బీజేపీకి ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే స్థానిక ఎన్నికలు జరిగాయని, అయినప్పటికీ బీజేపీ ప్రజాబలాన్ని నిరూపించుకుందని అన్నారు.
కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిస్తే, బీజేపీ కూడా ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచిందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ బలాన్ని నిరూపించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా పార్టీల నాయకత్వానికే ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయవని స్పష్టం చేశారు.
మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒకలా మాట్లాడిన ముఖ్యమంత్రి, మహబూబ్‌నగర్‌కు వెళ్లేసరికి మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒకసారి చెబుతూ, మరోసారి రెండు పార్టీలు కలిసి రావాలని పిలుపునివ్వడం ఆయన రాజకీయ అస్థిరతకు నిదర్శనమన్నారు.
2004లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, గులాం నబీ ఆజాద్‌లు కేసీఆర్ ఇంటికి వెళ్లి పొత్తు చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయ పొత్తుల చరిత్ర కాంగ్రెస్‌కే ఉందన్నారు.
రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదని, ఢిల్లీ నాయకత్వం చెప్పినట్టే ఆయన నడుచుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రేపు ఢిల్లీ నాయకత్వం వెళ్లి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోమంటే ఆగమేఘాల మీద వెళ్లి పొత్తు పెట్టుకునేది మీరే తప్ప బీజేపీ కాదని రఘునందన్ రావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా కార్యదర్శి రంజిత్ రెడ్డి MLN రెడ్డి బిజెపి మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.




