Medak: కేంద్ర పథకాలను వేగవంతం చేయాలి: ఎంపీ రఘునందన్ రావు!
Medak: మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘దిశ’ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
Medak: కేంద్ర పథకాలను వేగవంతం చేయాలి: ఎంపీ రఘునందన్ రావు!
మెదక్, సెప్టెంబర్ 25: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు.
గ్రామీణాభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్యుత్, మహిళా-శిశు సంక్షేమం, సామాజిక సంక్షేమం, పంచాయతీరాజ్, మున్సిపల్ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్నవి, పెండింగ్ పనుల వివరాలను సమీక్షించారు.
ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
రామ్‌జీ బీవీ పథకం కింద చేపడుతున్న పనులు నాణ్యతా ప్రమాణాలతో ఉండేలా చూడాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, సేవలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే సంబంధిత శాఖలు సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాకు అందుతున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. ఎంపీ సూచించిన అంశాలను తప్పనిసరిగా అమలు చేసి, తదుపరి దిశ సమావేశం నాటికి పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్‌ఓ జోజి, జిల్లా స్థాయి అధికారులు, దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




