Medak: మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి మెతుకు సీమ అధ్యయన యాత్ర డిమాండ్
Medak: ఎల్‌నినో ప్రభావంతో ఎండిన పంటలను పరిశీలించి మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని మెతుకు సీమ కరువు అధ్యయన యాత్ర డిమాండ్.
Medak: మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి మెతుకు సీమ అధ్యయన యాత్ర డిమాండ్
మెదక్: ఎల్‌నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, క్షేత్రస్థాయిలో పంట నష్టాలను సమగ్రంగా పరిశీలించి మెదక్ జిల్లాను కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించాలని మెతుకు సీమ కరువు అధ్యయన యాత్ర బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ నెల 10న ప్రారంభమైన కరువు అధ్యయన యాత్ర గురువారం. చేగుంట. నార్సింగ్ నిజాంపేట్ రామాయంపేట మండలాల్లో చేరుకుంది. ఈ సందర్భంగా ప్రగతి ధర్మారం, శివాయపల్లి, సుతార్‌పల్లి చిట్టోజు పల్లి నర్సంపల్లి రాయిలాపూర్ నస్కల్ నగరం వివిధ గ్రామాలలో బృంద సభ్యులు పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం రామాయంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బి. కొండల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం టిఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బట్టి అజయ్. మాట్లాడుతూ..కాళ్లకల్ ప్రాంతాన్ని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కరువు ప్రాంతంగా గుర్తించిన అధికారులు, వాస్తవంగా క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించలేదని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంతమైన కాళ్లకల్ను కరువు ప్రాంతంగా గుర్తించినప్పుడు జిల్లాలోని ఇతర గ్రామాల్లో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను కూడా సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
రైతులు తమ పొలాల్లో ఎండిపోయిన పంటల వివరాలను ఫొటోలతో సహా సేకరించి ప్రజావాణిలో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మొక్కజొన్న, జొన్న పంటలకే కాకుండా అన్ని ఆరుతడి పంటలకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
*ప్రతి పంటకు కొనుగోలు భరోసా కల్పించాలి*
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని, రోజుకు ఎన్ని గంటల విద్యుత్ అందిస్తారో ముందుగానే తెలియజేయాలని కోరారు. రైతులు సాగు చేసిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనే భరోసా కల్పించాలని అన్నారు. కొనుగోలు చేయకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయి మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సంపల్లి తరహాలో అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ పర్యటనలు చేపట్టాలి*
నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసినట్లు నాయకులు తెలిపారు. ఈ గ్రామంలో 19.5 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, సుమారు 25 మంది రైతులు బాధితులుగా ఉన్నట్లు వివరించారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని కోరారు.ప్రభుత్వం ఇకనైనా స్పందించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పరిహారం పంపిణీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్
*ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి*
కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకం కింద పని దినాలను పెంచాలని, పూర్తిగా ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో కరువు మండలాలుగా ప్రకటించిన ప్రాంతాలతో సంబంధం లేకుండా పంట నష్టాల వివరాలను అధికారులు సేకరించేవారని, ఈసారి ఆ ప్రక్రియ కూడా చేపట్టలేదని విమర్శించారు.
కరువు పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అధ్యయన యాత్రలో వివిధ గ్రామాల్లో సేకరించిన పంట నష్టాల వివరాలు, రైతుల సమస్యలతో నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బొందుగుల. నాగరాజు, స్వరాజ్య వేదిక నాయకులు కే. భాగయ్య, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, సిటిజన్ ఫోరం నాయకులు పి.డి. ఆనందం, బాలమణి, తెలంగాణ రక్షణ సేన MBC అధ్యక్షుడు ఇప్ప రమేష్ కరాటే ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.




