Medak: పంట ఎండి రైతు ఆత్మహత్య: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ!
Medak: మెదక్ జిల్లా శివ్వంపేటలో పంట ఎండిపోవడంతో రైతు శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎంపీ రఘునందన్ రావు పరామర్శించి రూ.50 లక్షల పరిహారం డిమాండ్ చేశారు.
Medak: పంట ఎండి రైతు ఆత్మహత్య: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ!
మెదక్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. సాగు చేసిన వరి పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురైన మాలోత్ శంకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పరామర్శించి, కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
శివ్వంపేట మండలంలోని భీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాకు చెందిన మాలోత్ శంకర్ తన వరి పొలంలో పంట సాగు చేశారు. అయితే, పంటకు సరిపడా నీరు అందక వరి పంట ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్.. తన పొలంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు శంకర్ కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు, సాగునీరు అందకపోవడం వంటి పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
మృతి చెందిన రైతు మాలోత్ శంకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల, మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, భీమ్లా తండా సర్పంచ్ లక్ష్మీ దుర్గ్య నాయక్, ఉపసర్పంచ్ కంస వెంకటేష్ నాయక్, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, మండల ఉపాధ్యక్షులు గోప్యా నాయక్, దుబ్బ శేఖర్, మామిడి నర్సారెడ్డి, జిల్లా ఎస్టీ మోర్చా కార్యదర్శి విట్టల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




