Narsapur: నర్సాపూర్‌లో చెరువు నీటి అక్రమ వినియోగంపై చర్యలు!
Narsapur: నర్సాపూర్ రాయరావు చెరువు నీటిని అక్రమంగా రిసార్ట్ అవసరాలకు వినియోగిస్తున్న అలంకార రిసార్ట్ మృగవాని యాజమాన్యంపై రైతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Narsapur: నర్సాపూర్‌లో చెరువు నీటి అక్రమ వినియోగంపై చర్యలు!
నర్సాపూర్: ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువు నీటిని అక్రమంగా వినియోగిస్తున్న రిసార్ట్ యాజమాన్యంపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువు (రాయల్ చెరువు) నీటిని సమీపంలోని అలంకార రిసార్ట్ మృగవాని యాజమాన్యం అక్రమంగా మోటార్ ఏర్పాటు చేసుకొని వినియోగిస్తున్నట్లు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్ అధికారులు సంయుక్తంగా చెరువు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెరువు నుంచి మోటార్ ద్వారా నీటిని తోడుకొని ప్రభుత్వ అనుమతి లేకుండా రిసార్ట్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*చెరువుల నీటిని అక్రమంగా వినియోగిస్తే చర్యలు తప్పవు*
ప్రభుత్వ చెరువులు ప్రజలందరికీ, ముఖ్యంగా రైతుల సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమని నర్సాపూర్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువుల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడుకొని వ్యక్తిగత లేదా వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నీటి వనరుల పరిరక్షణలో భాగంగా అధికారులు చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




