Narsapur: ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు!
Narsapur: నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో యువకుడు మృతి చెందడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
Narsapur: ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు!
Narsapur: నర్సాపూర్‌లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న 32 మంది అస్వస్థతకు గురికాగా, వారిలో పిట్ల సాయిరాం అనే యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 27 మంది బాధితులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
సాయిరాం కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన నర్సాపూర్‌కు చెందిన పిట్ల సాయిరాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైద్యులకు సూచించారు.
హోటళ్లలో నిరంతరం తనిఖీలు చేపట్టాలి
రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా తెలంగాణ ఫుడ్ కమిషనర్ మహంతి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఎంపీ కోరారు. మెదక్ జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సైతం తన బాధ్యతలను గుర్తించి హోటళ్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీ విమర్శించారు. ఇకనైనా సంబంధిత అధికారులు అప్రమత్తమై, నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, సాధ్యమైనంతవరకు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆస్పత్రిలో వైద్యుల కొరత.. అదనపు అంబులెన్స్‌కు కృషి
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరతతో పాటు అత్యవసర సమయాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఈ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అదనపు అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మరోవైపు, ఫుడ్ పాయిజన్‌కు గురైన బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.




