Narsapur: ఎల్‌నినో ముప్పు.. వరికి బదులు ఆరుతడి పంటలే శ్రేయస్కరం!

Narsapur: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగు చేయాలని ఆవంచలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ రైతులకు సూచించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 29 Oct 2026 5:09 PM IST
Narsapur
X

Narsapur: ఎల్‌నినో ముప్పు.. వరికి బదులు ఆరుతడి పంటలే శ్రేయస్కరం!

నర్సాపూర్: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు యాసంగి సీజన్‌లో తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ భూసారాన్ని కాపాడుకోవాలని, పంటల మార్పిడి ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

నర్సాపూర్ మండలంలోని ఆవంచ రైతు వేదికలో గురువారం (అక్టోబర్ 29) నిర్వహించిన ఖేతి బచావో అభియాన్ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా శనగ, కుసుమ, జొన్న, పెసర, మినుము వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించవచ్చని వివరించారు.

రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని తెలిపారు. నేలలో తేమను కాపాడే వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ భూసారాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. నూతన వ్యవసాయ విధానాలు, సేంద్రియ పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును కూడా రైతులు పరిశీలించాలని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సబ్సిడీపై ఒక్కో మొక్కను రూ.20 చొప్పున అందించడంతో పాటు, ఎకరానికి 57 మొక్కలు నాటుకునే అవకాశం ఉందని వివరించారు. అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.4,200 ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించిన అనుకూలతలు, నీటి లభ్యతను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పంటల మార్పిడి వల్ల నేల సారాన్ని మెరుగుపరచుకోవచ్చని, నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు వ్యవసాయంలో స్థిరమైన దిగుబడులను సాధించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కర్ణాకర్, ఉపసర్పంచ్ కిష్టయ్య, విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి లావణ్య, బీటీఎం హరిత, పంచాయతీ కార్యదర్శి, స్థానిక రైతులు పాల్గొన్నారు...

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur