Medak: కౌడిపల్లిలో సుందరంగా బతుకమ్మ నిమజ్జన ఘాట్లు!
Medak: సద్దుల బతుకమ్మ నిమజ్జనం కోసం మెదక్ జిల్లా కౌడిపల్లి మినీ ట్యాంక్ బండ్ను సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ సొంత ఖర్చులతో సుందరంగా తీర్చిదిద్దారు.
Medak: కౌడిపల్లిలో సుందరంగా బతుకమ్మ నిమజ్జన ఘాట్లు!
మెదక్, అక్టోబర్ 14: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా కౌడిపల్లిలో బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని మినీ ట్యాంక్ బండ్పై మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ తన సొంత ఖర్చులతో నిమజ్జన ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ తన పాలకవర్గంతో కలిసి మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను శుభ్రం చేయించి, నిమజ్జనానికి అనువుగా సిద్ధం చేశారు.
సర్పంచ్ స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి మినీ ట్యాంక్ బండ్పై ఉన్న ముళ్లపొదలు, గడ్డిని తొలగించారు. కట్ట ఉపరితలంపై మొరం పోయించి, డోజర్ సహాయంతో చదును చేయించారు. అలాగే సద్దుల బతుకమ్మ నిమజ్జన సమయంలో రాత్రివేళ కూడా తగినంత వెలుతురు ఉండేలా విద్యుత్ స్తంభాలకు దీపాలను ఏర్పాటు చేశారు.
మహిళలు సురక్షితంగా, సౌకర్యవంతంగా బతుకమ్మలను నిమజ్జనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగను ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో సర్పంచ్, పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ ఏర్పాట్లలో సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్తో పాటు ఉపసర్పంచ్ శ్వేతా మల్లికార్జున్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కౌడా శ్రీనివాస్ గుప్తా, వార్డు సభ్యులు మక్బుల్, దేవేందర్ కుమార్, అజ్జమెర్ రమేష్, గ్రామ కార్యదర్శి నగేష్, కారోబార్ ఎల్లం, నాయకులు రాగుల భూమయ్య, ఓబులాష్, రమేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, చంద్రం దుర్గ గౌడ్, వీరేశం గౌడ్, ముంబై లక్ష్మణ్ యాదవ్, నాన్ల వెంకటేశం గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.




