Medak: మెదక్ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా రావణ దహన వేడుకలు

Medak: మెదక్ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన రావణ దహన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక.

NAGARAJ, MEDAK
Published on: 20 Oct 2026 9:43 PM IST
Medak
X

Medak: మెదక్ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా రావణ దహన వేడుకలు

మెదక్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటామని తెలిపారు. శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించిన రోజును విజయదశమిగా జరుపుకోవడం ధర్మం ఎప్పటికీ గెలుస్తుందనే సందేశాన్ని ఇస్తుందన్నారు. మెదక్‌లో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఒకే చోట చేరి ఐక్యతను చాటడం అభినందనీయమన్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని విజయదుర్గ అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

అనంతరం భారీ రావణాసురుడి దిష్టిబొమ్మకు నిప్పంటించడంతో మైదానం హర్షధ్వానాలతో మార్మోగింది. వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులు, యువత రావణ దహనాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ సభ్యులు.మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK