Toopran: దళితులపై దాడులను అరికట్టాలి: తూప్రాన్ ఆర్డీవోకు వినతి!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్లో బతుకమ్మ, దసరా వేళ దళితులపై జరిగిన దాడుల నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్డీవోకు దళిత సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి.
Toopran: దళితులపై దాడులను అరికట్టాలి: తూప్రాన్ ఆర్డీవోకు వినతి!
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలలో దళితులపై వరుసగా దాడులు చేసిన నిందితులను SC/ST అట్రాసిటీ కేసులలో కఠినంగా శిక్షించి దళితులకు రక్షణ కల్పించాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్, తూప్రాన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్ RDO కి వినతిపత్రం సమర్పించారు.
సోమవారం తూప్రాన్ RDO కార్యాలయంలో RDO బాబయ్యను కలిసి DBF జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాలల JAC మెదక్ జిల్లా వైస్ చైర్మన్ లు మామిడి వెంకటేష్,మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల అశోక్, తూప్రాన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గజ్జల కృష్ణ, ప్రధాన కార్యదర్శి మన్నె భాను ప్రసాద్ లు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి (PT), కూచారం, తూప్రాన్ మండలం కిష్టాపూర్, వెంకటాయపల్లి, వెల్దుర్తి మండలం ఏదులపల్లి గ్రామాల్లో బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా దళితులపై దాడులు జరిగాయన్నారు.
కొనాయిపల్లి ఘటన, డప్పు కొట్టేందుకు కనీస వేతనం అడిగినందుకు గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, అతని అనుచరులు 30 మంది దళితులపై మూకుమ్మడిగా దాడి చేశారని, అడ్డువచ్చిన మహిళలను దూషించారని, ముగ్గురు పంచాయతీ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. FIR No.287/2026 ను ఆల్టరేషన్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసి సర్పంచ్ ను అరెస్ట్ చేసి, పంచాయతీ చట్టం సెక్షన్ 37 ప్రకారం పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
కూచారం, కిష్టాపూర్ ఘటనలు కూచారంలో దళిత సర్పంచ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వద్ద ఆడబోమంటూ కుల వివక్ష చూపి, నిలదీసిన సర్పంచ్ భర్త రఘుపై దాడి చేశారన్నారు. కిష్టాపూర్ లో దళిత మహిళలు బతుకమ్మ ఆడడాన్ని జీర్ణించుకోలేక సాంఘిక బహిష్కరణ చేశారని తెలిపారు.
పోలీసులు బాధితులకు రక్షణ కల్పించకుండా నిందితులకు వత్తాసు పలుకుతున్నారని, నిర్లక్ష్యం వహించిన మనోహరాబాద్ SI ని సస్పెండ్ చేయాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు మేరకు ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని RDO కు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బైరం సత్యలింగం, సీనియర్ దళిత నాయకులు కనిగిరి లింగం, కోరబోయిన ప్రవీణ్ కుమార్, పర్స ప్రభాకర్, శాస నాగేంద్ర ప్రసాద్, శేరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.




