Medak: రెడ్డిపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 4 Nov 2026 3:36 PM IST
Medak
X

Medak: రెడ్డిపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Medak: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ముఖ్యంగా సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం అందిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, ఐకేపీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్, వార్డు సభ్యులు చందగొని మహేష్ గౌడ్, ఎర్లా శేఖర్, నిరంజన్ గౌడ్, ఐకేపీ అధికారి సంగమేశ్వర, సత్యనారాయణ గౌడ్, దయాకర్, నక్క ప్రశాంత్, సొమ్మని రాఘవేందర్, ఎర్ర భిక్షపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR