Medak: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి మెదక్ కలెక్టర్

Medak: మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం. మండలానికి 6గురు స్పెషల్ ఆఫీసర్ల నియామకం, 10 రోజుల్లో స్పెషల్ డ్రైవ్.

NAGARAJ, MEDAK
Published on: 22 Oct 2026 4:24 PM IST
Medak
X

Medak: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి మెదక్ కలెక్టర్

మెదక్: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మెదక్ జిల్లా ముందంజలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు.గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.

నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రతి మండలానికి ఆరుగురు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఒక్కో అధికారి నాలుగైదు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించడంతోపాటు, మొదటి, రెండో విడతల్లో ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులతో నేరుగా సమావేశమై నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రానున్న పది రోజుల్లో ఇప్పటివరకు ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. మండలాల వారీగా ప్రతి గ్రామంలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి, నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమస్యలు ఉన్నాయనే కారణంతో నిర్మాణ పనులు నిలిచిపోకూడదని, ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా తగిన సూచనలు, సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK