Medak: పశుసంపదపై ఎల్‌నినో ప్రభావం పడకుండా చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్

Medak: మెదక్ జిల్లాలో పశువులకు గాలికుంటు టీకాలు, తాగునీరు, పశుగ్రాస కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించిన కలెక్టర్ ప్రతిమా సింగ్.

NAGARAJ, MEDAK
Published on: 7 Nov 2026 4:58 PM IST
Medak
X

Medak: పశుసంపదపై ఎల్‌నినో ప్రభావం పడకుండా చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్: ఎల్‌నినో ప్రభావం పశుసంపదపై పడకుండా ముందస్తు రక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఎల్‌నినో ప్రభావం నుంచి పశువులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, 'భారత్ పశుధన్' యాప్ వినియోగంపై ఆమె సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 67 పశువైద్యశాలల ద్వారా సమగ్ర పశువైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 12వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరువు పరిస్థితులు, ఎండ తీవ్రత నుంచి పశుసంపదను కాపాడేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీల ద్వారా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఉపాధి హామీ పథకం కింద ప్రైవేట్ భూముల్లో పశుగ్రాస సాగును ప్రోత్సహించాలని, రైతులు ముందుగానే ఎండుగడ్డి నిల్వలు సమకూర్చుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎండ తీవ్రత వల్ల పశువులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజుకు 40 నుంచి 60 లీటర్ల వరకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలోని చిన్న నీటిపారుదల చెరువులు, కుంటలను గుర్తించి వాటిలో నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పాడి రైతులకు డిజిటల్ సేవలు

అనంతరం పాడి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద అందుబాటులోకి తీసుకొచ్చిన 'భారత్ పశుధన్' యాప్ సేవలపై కలెక్టర్ వివరించారు. పశువుల ఆరోగ్యం, సంతానోత్పత్తి, ఉత్పాదకతకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేసుకునేలా పాడి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులందరూ ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని పశువుల ఉత్పాదకతను పెంచుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆదిత్య వర్మ, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, విజయ డెయిరీ డీడీ కె. రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, మెదక్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK