Medak: ఇండస్ మెడికేర్ ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం!

Medak: మెదక్ జిల్లా మనోహరాబాద్ ఇండస్ మెడికేర్ పరిశ్రమ గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ కూటమిపై సీఐటీయూ 13 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది.

NAGARAJ, MEDAK
Published on: 3 Nov 2026 4:15 PM IST
Medak
X

Medak: ఇండస్ మెడికేర్ ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం!

మెదక్ నవంబర్ ౦౩: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి శివారులోని ఇండస్ మెడికేర్ పరిశ్రమలో మంగళవారం నిర్వహించిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. ఐఎన్‌టీయూసీ–బీఆర్‌టీయూ కూటమిపై 13 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది.

మొత్తం 68 ఓట్లు పోలవగా, సీఐటీయూకు 38, ఐఎన్‌టీయూసీకి 25 ఓట్లు లభించాయి.ఈ ఎన్నికల్లో మండల కాంగ్రెస్ నాయకుడు, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఓటమి చెందగా, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. మల్లికార్జున్ విజయం సాధించారు. గెలుపు అనంతరం కార్మికులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా సీఐటీయూపై నమ్మకంతో విజయం అందించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యాజమాన్యంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

పారిశ్రామిక ప్రాంతంలోనే మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.కార్మిక సంఘాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులకు పాల్పడటం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు వేసిన కార్మికులను అభినందించారు. పరిశ్రమలోని సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్మిక వర్గాన్ని సీఐటీయూ సిద్ధం చేస్తుందని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించిన కార్మిక శాఖ అధికారులు, పరిశ్రమ యాజమాన్యం, పోలీసులకు, పాత్రికేయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలేష్, నాయకులు సుజాత, తిరుపతి, పూర్ణేశ్, ఉపేంద్ర, విక్రమ్ రెడ్డి, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK