Sangareddy: జోగిపేట శివారులో రోడ్డుపైనే ఇసుక దందా ప్రాణసంకటంగా మారిన ప్రయాణం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా జోగిపేట శివారు ప్రధాన రహదారిపై ఇసుక అక్రమ నిల్వలు పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

UMASHANKAR, ANDOLE
Published on: 18 Oct 2026 11:04 AM IST
Sangareddy
X

Sangareddy: జోగిపేట శివారులో రోడ్డుపైనే ఇసుక దందా ప్రాణసంకటంగా మారిన ప్రయాణం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జోగిపేట పట్టణ శివారు ప్రధాన రహదారిపై ఇసుక అక్రమ విక్రయాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. కొందరు ఇసుక అక్రమార్కులు నిబంధనలను కాదని, ఏకంగా ప్రధాన రహదారి పక్కనే ఇసుకను భారీగా నిల్వ చేస్తూ బహిరంగంగానే వ్యాపారం సాగిస్తున్నారు. స్థానిక వాగుల నుండి రాత్రి వేళల్లో లారీల ద్వారా ఇసుకను తరలించి, జోగిపేట శివారు రోడ్డుపై కుప్పలుగా పోస్తున్నారు. అనంతరం పగటిపూట ఈ ఇసుకను ఇళ్ల నిర్మాణదారులకు ట్రాక్టర్ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

వాహనదారులకు ప్రాణసంకటం..

రోడ్డుపై ఇసుక నిల్వలు పేరుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైక్‌లపై వెళ్లే క్రమంలో ఇసుకపై టైర్లు జారి కిందపడి పలువురు గాయపడుతున్నారు. రాత్రి వేళల్లో రహదారిపై ఎలాంటి లైటింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో, చీకట్లో ఇసుక కుప్పలు కనిపించక వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సగానికి పైగా ఇసుకతో ఆక్రమణకు గురవుతుండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలకు దారి లేక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యమే అండగా?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహదారులను ఆక్రమించి ఇసుక గానీ, ఇతర నిర్మాణ వ్యర్థాలను గానీ నిల్వ చేయడం చట్టరీత్యా నేరం. అనుమతులు లేకుండా ఇలా రోడ్లపైనే ఇసుక అక్రమ దందా సాగిస్తున్నా మైనింగ్, మున్సిపల్, మరియు పోలీస్ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ అక్రమ వ్యాపారానికి అండగా నిలుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

తక్షణ చర్యలు తీసుకోవాలి: స్థానికుల డిమాండ్

జోగిపేట శివారు రోడ్డుపై ప్రమాదకరంగా మారిన ఇసుక కుప్పలను తక్షణమే తొలగించాలని పట్టణ ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, జోగిపేట శివారులో ఇసుక అక్రమ విక్రయాలు జరుపుతున్న వారిపై కఠినమైన నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE