Zaheerabad: ట్రైడెంట్ షుగర్స్ కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఈశ్వర్ ప్రసాద్!
Zaheerabad: జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్స్‌లో పదేళ్లకు పైగా పనిచేసిన 30 మంది కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని శుక్రవారం హెచ్ఎంఎస్ నేత ఈశ్వర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
Zaheerabad: ట్రైడెంట్ షుగర్స్ కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఈశ్వర్ ప్రసాద్!
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలోని ట్రైడెంట్ షుగర్స్ లిమిటెడ్‌లో పదేళ్లకు పైగా పనిచేసిన 30 మంది కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర బకాయిలను తక్షణమే చెల్లించాలని హింద్ మజ్దూర్ సభ (హెచ్ ఎం ఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆర్. ఈశ్వర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ గేటు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విజయవంతమైన పరిష్కార దరఖాస్తుదారు 'డెల్టా సోర్సింగ్' సంస్థ 135 మంది కార్మికులకు గ్రాట్యుటీ చెక్కులు, గుడ్‌విల్ చెల్లింపులు అందించినప్పటికీ, బకాయిల కోసం ఎన్సీఎల్టీ ని ఆశ్రయించిన 30 మంది కార్మికులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తమ దరఖాస్తు హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్-1 ముందు (ఐ.ఏ. (ఐబీసీ) నం.1516 ఆఫ్ 2025) పెండింగ్‌లో ఉందని తెలిపారు.
అదే వర్గంలో, సమాన అర్హతలు కలిగిన ఇతర కార్మికులకు చెల్లింపులు జరిపి, తమను ఎందుకు మినహాయించారో యాజమాన్యం, రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్ పి) రాతపూర్వకంగా సమాధానం చెప్పాలని ఈశ్వర్ ప్రసాద్ నిలదీశారు. ఆమోదిత ప్రణాళిక కింద రూ. 3.46 కోట్లు, సెటిల్మెంట్ పత్రం ప్రకారం రూ. 6.21 కోట్ల గుడ్‌విల్ మొత్తాన్ని ఏ పద్దు కింద ఎవరికి ఎంత చెల్లించారో పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
దివాలా పరిష్కార సంహిత (ఐబీసీ) నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కార్మికుల వేతనాలు, పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే చెరకు కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ ఉప కమిషనర్లకు వినతిపత్రాలు అందించామని, అధికారులు వెంటనే యాజమాన్యం, డెల్టా సోర్సింగ్, ఆర్పీలతో త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించాలని కోరారు.




