Hathnoora: గణేష్ నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు - డీజేలపై కఠిన నిబంధనలు

Hathnoora: హత్నూరలో గణేష్ నిమజ్జనానికి పోలీసుల కఠిన నిబంధనలు. రాత్రి 10 గంటల తర్వాత డీజేల వినియోగం నిషేధమని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి హెచ్చరిక.

G Ashok Reddy, Narsapur
Published on: 16 Sept 2026 7:42 PM IST
Hathnoora
X

Hathnoora: గణేష్ నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు - డీజేలపై కఠిన నిబంధనలు

హత్నూర: గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు హత్నూర పోలీసులు అప్రమత్తమయ్యారు. నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 16-09-2026న హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని DJ ఆపరేటర్లు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కీలక సూచనలు చేశారు.

రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు బ్రేక్..

వినాయక మండపాలు, నిమజ్జన కార్యక్రమాల్లో సౌండ్ సిస్టమ్స్ వినియోగించే సమయంలో చట్టబద్ధంగా అనుమతించబడిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJ సౌండ్, లౌడ్‌స్పీకర్లను వినియోగించరాదని స్పష్టం చేశారు.

విద్యార్థులు, రోగులు, వృద్ధులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌండ్ సిస్టమ్స్‌ను పరిమిత స్థాయిలో వినియోగించాలని సూచించారు.

ఆ ప్రాంతాల్లో నిబంధనలు మరింత కఠినం

పాఠశాలలు, ఆసుపత్రులు, మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని పోలీసులు హెచ్చరించారు.

ఈ సూచనలు సుప్రీంకోర్టు ఆదేశాలు, శబ్ద కాలుష్య (నియంత్రణ మరియు నియమాలు) 2000 నిబంధనలకు అనుగుణంగా జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..

DJ ఆపరేటర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు.. గణేష్ మహోత్సవాలు లేదా నిమజ్జన కార్యక్రమాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా DJ సౌండ్ ఏర్పాటు చేసి వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ASI గౌస్, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలి: SI శ్రీధర్ రెడ్డి

గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు DJ ఆపరేటర్లు, ఉత్సవాల నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని హత్నూర SI శ్రీధర్ రెడ్డి కోరారు.

నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని SI శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur