Medak: మెదక్ కలెక్టరేట్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. కలెక్టర్ హాజరు

Medak: మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రకటించారు.

NAGARAJ, MEDAK
Published on: 16 Oct 2026 10:33 PM IST
Medak
X

Medak: మెదక్ కలెక్టరేట్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. కలెక్టర్ హాజరు

మెదక్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు, ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఏర్పాటు చేసి మహిళలు గౌరీమాతకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ గేయాలు ఆలపిస్తూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలంతో కలెక్టరేట్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పూలను దైవాలుగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళలను శక్తి స్వరూపిణులుగా గౌరవించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాలు వంటి పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని సూచించారు.

బతుకమ్మ వేడుకల్లో భాగంగా అందంగా అలంకరించిన బతుకమ్మలకు నిర్వహించిన పోటీల్లో డీఆర్డీఓ శాఖకు చెందిన బతుకమ్మ ప్రథమ స్థానం, జిల్లా సంక్షేమ శాఖ బతుకమ్మ ద్వితీయ స్థానం సాధించాయి. వేడుకలను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, మహిళలు, ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK