Patancheru: రేషన్ డీలర్లకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Patancheru: గజ్వేల్లో జరిగిన రేషన్ డీలర్ల గౌరవ వేతన సాధన సభలో హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు.
Patancheru: రేషన్ డీలర్లకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Patancheru: పల్లె నుండి పట్నం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని.. సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాష్ట్ర రాజధాని లో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన.. రాష్ట్ర స్థాయి గౌరవ వేతన సాధన సభ, రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల సంభవించిన, కరోనా లాంటి మహమ్మారి మూలంగా లక్షలాదిమంది చనిపోయిన సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర శ్లాగనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లక్ష మందితో కలిసి రాష్ట్ర రాజధానిలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేషన్ డీలర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, సంఘం ప్రతినిధులు, రేషన్ డీలర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




