Hathnoora: హత్నూరలో విద్యుత్ సమస్యపై రైతుల ధర్నా!
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోరుతూ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతుల భారీ ధర్నా మరియు ఆందోళన.
Hathnoora: హత్నూరలో విద్యుత్ సమస్యపై రైతుల ధర్నా!
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులు విద్యుత్ సమస్యపై ఆందోళనకు దిగారు. భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు.
అంతకుముందు కాసాల చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రైతులు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పంటలకు అవసరమైన సమయంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆరోపణల ప్రకారం.. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పాటు లో వోల్టేజ్ సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో బోరు మోటార్లు సైతం కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు మరమ్మతులకు గురికావడం, కొత్త మోటార్లు ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు.
మరోవైపు పొట్ట దశకు చేరుకున్న వరి పంటలకు సకాలంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేశామని, కీలకమైన సమయంలో విద్యుత్ అందకపోవడంతో పంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు కనీసం పంటకు అవసరమైన సమయంలో విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు సంఘం నాయకులు అన్నారు. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల పంటలను కాపాడేందుకు వెంటనే 24 గంటల విద్యుత్ సరఫరా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు.




