Manoharabad: కాళ్లకల్‌లో ఎక్సైజ్ మెరుపు దాడులు.. గంజాయి పట్టివేత

Manoharabad: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కేఎల్ఆర్ వెంచర్‌లో ఎక్సైజ్ డీటీఎఫ్ దాడులు జరిపి 956 గ్రాముల ఎండు గంజాయితో బీహార్ యువకుడిని అరెస్ట్ చేసింది.

RAJU,TOOPRAN
Published on: 5 Nov 2026 7:27 PM IST
Manoharabad
X

Manoharabad: కాళ్లకల్‌లో ఎక్సైజ్ మెరుపు దాడులు.. గంజాయి పట్టివేత

మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పరిధిలోని కేఎల్ఆర్ గ్రీన్ వెంచర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన జ్యోతిష్ కుమార్ (22) వద్ద 956 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించి పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డీటీఎఫ్ సీఐ జె. గోపాల్ వెల్లడించారు.

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య గౌడ్, సూపరింటెండెంట్ ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు డీటీఎఫ్ సీఐ జె. గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కాళ్లకల్‌లోని కేఎల్ఆర్ గ్రీన్ వెంచర్‌లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న జ్యోతిష్ కుమార్‌ను తనిఖీ చేయగా అతని వద్ద 956 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని సీఐ గోపాల్ పేర్కొన్నారు. నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని, ఎక్కడైనా గంజాయి వంటి మాదకద్రవ్యాల సమాచారం అందితే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

పట్టుబడిన జ్యోతిష్ కుమార్‌తో పాటు స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయిని తదుపరి చర్యల నిమిత్తం నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి అప్పగించినట్లు అధికారులు వివరించారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పుండరీకం, వహీద్, స్రవంతి, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తనిఖీలు, నిఘా చర్యలను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN