Medak: ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు!

Medak: మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో నీటి కొరత, పారిశుధ్య లోపం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

NAGARAJ, MEDAK
Published on: 3 Nov 2026 10:40 AM IST
Medak: ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు!
X

Medak: ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు!

Medak: భక్తితో వస్తే భయమేస్తోంది.. ప్రశాంతత కోసం వస్తే నరకం కనిపిస్తోంది! ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఇప్పుడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రకృతి కన్నెర్ర జేస్తే.. దేవాదాయ శాఖ అధికారులు దానికి తోడయ్యారు.

భక్తుల కష్టాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నా.. ఎండోమెంట్ అధికారుల మొద్దు నిద్ర మాత్రం వీడటం లేదు. కోట్లాది రూపాయల కానుకలు కొల్లగొడుతున్న అధికారులు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఎల్ నినో ప్రభావం ఏడుపాయల క్షేత్రాన్ని తాకింది. వర్షాలు లేక జీవనది మంజీరా పూర్తిగా ఎండిపోయింది. పరవళ్లు తొక్కాల్సిన ఏడు పాయలు.. ఇప్పుడు కేవలం బురద గుంతలుగా దర్శనమిస్తున్నాయి.

సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బురద నీటిలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చర్మవ్యాధులు వస్తాయని భయపడుతూనే.. ఆ కలుషిత నీటిని తలపై చల్లుకుంటున్నారు. నది ఎండిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా?

గతంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బోర్ల షవర్లు ఎందుకు పని చేయడం లేదు? పైప్‌లైన్లు పగిలి, మోటార్లు కాలిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ షవర్లన్నీ ఇప్పుడు కేవలం 'షో పీస్‌లు'గా మారి భక్తులను వెక్కిరిస్తున్నాయి!

ఇక ఆలయ ప్రాంగణంలో భిక్షాటకుల దౌర్జన్యం మితిమీరిపోయింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను వీరు వేధింపులకు గురిచేస్తున్నారు. గుంపులు గుంపులుగా చేరి భక్తులను చుట్టుముట్టడం.. డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడం, దుర్భాషలాడటం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. చిన్న పిల్లలతో, కుటుంబాలతో వచ్చే భక్తులు వీరి భయానికి ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు.

ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇంత దౌర్జన్యం జరుగుతున్నా.. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? దేవాదాయ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా? లేక భక్తుల రక్షణను గాలికి వదిలేశారా? అని భక్తులు నిలదీస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.. ఏడుపాయల్లోని దేవాదాయ సత్రాలు! భక్తుల బస కోసం కట్టిన సత్రాలు ఇప్పుడు నరకకూపాలను తలపిస్తున్నాయి. సత్రాలలో పరిశుభ్రత అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. బాత్రూమ్‌లు, స్నానాల గదులు అత్యంత దారుణంగా తయారై దుర్వాసన వెదజల్లుతున్నాయి.

కనీసం తాగడానికి చుక్క నీరు లేదు. గదులలో లైట్లు లేవు.. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నా ఫ్యాన్లు తిరగవు. చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు కరెంట్ లేని ఆ చీకటి గదుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఈఓ గానీ, సంబంధిత అధికారులు గానీ కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ఏడుపాయల దుర్గమ్మ ఆలయానికి వచ్చేది భక్తితో.. కానీ ఇక్కడికి వస్తే దక్కేది మాత్రం తీవ్ర అసహనం, ఆవేదనే! ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ, ప్రభుత్వ ఖజానా నింపుతున్న ఈ క్షేత్రంలో భక్తులకు ఈ స్థాయి దుస్థితి ఎదురుకావడం సిగ్గుచేటు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించాలి. నిరూపయోగంగా ఉన్న షవర్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి. భిక్షాటకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి, సత్రాల నిర్వహణను మెరుగుపరచాలి అన్ని భక్తులు వేడుకుంటున్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK