Narsapur: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ క్విజ్ పోటీలు
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డివిజన్ స్థాయి సైన్స్ క్విజ్ పోటీలు, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా జరిగాయి.
Narsapur: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ క్విజ్ పోటీలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డివిజన్ స్థాయి సైన్స్ క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. అదే విధంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్ల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఉత్సాహం, సందడి మధ్య ఈ రెండు కార్యక్రమాలు ఆహ్లాదకరంగా సాగాయి.
జూనియర్ కళాశాల విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం, ఆలోచనా శక్తి, పోటీతత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం అంశాలపై నాలుగు రౌండ్లలో క్విజ్ పోటీలు నిర్వహించారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని పలు జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్ మార్గదర్శకత్వంలో, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆదెప్ప అధ్యక్షతన, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. ఖాజా ఆరిఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎం. లక్ష్మీరాజు యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విజ్ఞానం, ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.
నాలుగు రౌండ్లలో ఉత్కంఠభరితంగా సాగిన క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులు అందజేశారు. ఇందులో ప్రథమ బహుమతిని TGTWR బాలుర గురుకుల కళాశాల, నర్సాపూర్ విద్యార్థులు కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతిని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సాపూర్ విద్యార్థులు సాధించారు. విజేతలను ముఖ్య అతిథులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.
మరోవైపు డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఆత్మీయంగా ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. నూతన విద్యార్థులకు కళాశాల వాతావరణాన్ని పరిచయం చేస్తూ సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య స్నేహభావం, పరస్పర సహకారం పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుకను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు, సందడితో ఫ్రెషర్స్ పార్టీ ఉల్లాసంగా సాగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. రమేష్, డాక్టర్ బి. రవి కుమార్, డాక్టర్ ఎ. అనిత, ఎస్ మహేందర్ రెడ్డి,ఎ. శ్రీనివాస్, వి. హేమంత్ కుమార్ చారి, ఎస్. రాజు, సి.హెచ్. రాములు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సహకారంతో కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో పాటు ఫ్రెషర్స్ పార్టీని చక్కగా నిర్వహించిన సీనియర్ విద్యార్థులను కళాశాల నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.




