Medak: మెదక్‌లో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మించాలి!
Medak: మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మించాలని తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత పదేళ్ల పాలనపై విమర్శలు, ఎస్టీ స్థల కేటాయింపు పై విజ్ఞప్తి.
Medak: మెదక్‌లో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మించాలి!
Medak: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వేలాది మంది పోరాటం చేయగా, ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి అమరవీరుల త్యాగాలను భావితరాలకు గుర్తు చేసేలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమరవీరుల స్తూపాలను నిర్మించారు.
హైదరాబాదులో సైతం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేసి అమరవీరుల చరిత్రను పొద్దు పరచాలని లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అమరవీరుల స్మారక చిహ్నం లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మెదక్ జిల్లా కేంద్రంలో మాత్రం ఇప్పటికీ అమరవీరుల స్తూపం లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తుంటారు. కానీ మెదక్ జిల్లా కేంద్రంలో శాశ్వత అమరవీరుల స్తూపం లేకపోవడంతో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్తూపం వద్దనే నివాళులర్పించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, యువత, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు అమరవీరులను స్మరించుకునేందుకు శాశ్వత వేదిక లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో అమరవీరుల స్తూపం ఎందుకు నిర్మించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకురాలిగా చెప్పుకునే ఆమె హయాంలోనే అమరవీరుల స్తూపంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అమరవీరుల త్యాగాలకు తగిన గుర్తింపు లభించకపోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమరవీరుల త్యాగాలను మాటల్లో కాకుండా చేతల్లో గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కేంద్రంలో అనువైన స్థలాన్ని కేటాయించి తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేధావులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు కోరుతున్నారు. అమరవీరుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యంగా మెదక్‌లో అమరవీరుల స్తూపం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.




