Narsapur: నర్సాపూర్‌లో రైస్ మిల్లుపై పౌరసరఫరాల శాఖ ఆకస్మిక తనిఖీలు!

Narsapur: నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లోని రైస్ మిల్లులో రూ.1.52 కోట్ల విలువైన ధాన్యం తేడా రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు 6ఏ కేసు నమోదు చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 5 Oct 2026 9:04 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో రైస్ మిల్లుపై పౌరసరఫరాల శాఖ ఆకస్మిక తనిఖీలు!

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామంలోని ఏకే ట్రేడర్స్ బిన్నీ రైస్ మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మిల్లుకు కేటాయించిన ధాన్యానికి భౌతిక తనిఖీ నిర్వహించగా, రికార్డుల్లో ఉన్న ప్యాడీ (వరి ధాన్యం) మిల్లులో అందుబాటులో లేదని అధికారులు గుర్తించారు.

మిల్లులో నిల్వలు, రికార్డులను పరిశీలించిన అధికారులు.. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యంలో భారీగా తేడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మిల్లులో లేని ధాన్యం విలువ సుమారు రూ.1 కోటి 52 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం నిల్వల్లో తేడాలు గుర్తించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం 6ఏ కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం నిల్వలు, రికార్డుల్లో వ్యత్యాసాలపై తదుపరి చర్యలు కొనసాగనున్నాయి.

ఈ తనిఖీలో మెదక్ జిల్లా పౌరసరఫరాల శాఖ ఏసీఎస్ఓ, సివిల్ సప్లైస్ ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింహులు, మెదక్ జిల్లా డీసీఎస్ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి చెందిన జేఏ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం నిల్వల విషయంలో అక్రమాలకు తావులేకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో రైస్ మిల్ యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR