Narsapur: నర్సాపూర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం!
Narsapur: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు.. మత్తుపదార్థాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సీఐ రంగా కృష్ణ హితవు.
Narsapur: నర్సాపూర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం!
Narsapur: యువత మత్తుపదార్థాలకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని నర్సాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంగా కృష్ణ సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువు, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సామాజిక సేవ వంటి సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని “నశా ముక్త్ యువ – వికసిత్ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా. కె. హుస్సేన్ మార్గదర్శకత్వంలో, వైస్ ప్రిన్సిపాల్ డా. సమీరా నజ్మీన్ అధ్యక్షతన ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ రంగా కృష్ణ మాట్లాడుతూ నేటి యువతలో కొందరు తెలియకుండానే మత్తుపదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం భవిష్యత్తును దెబ్బతీయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యానికి హానికరమైన మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే సెల్‌ఫోన్ వినియోగంపై కూడా విద్యార్థులు నియంత్రణ పాటించాలని సీఐ సూచించారు. చదువుపై ఏకాగ్రత దెబ్బతినకుండా అవసరానికి అనుగుణంగా, పరిమితంగా ఫోన్‌ను ఉపయోగించాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుని, చదువుపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని విద్యార్థులకు హితవు పలికారు.
వైస్ ప్రిన్సిపాల్ డా. సమీరా నజ్మీన్ మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడంతో పాటు యువతలో సామాజిక బాధ్యత, సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించడంలో ఎన్‌ఎస్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
IQAC కోఆర్డినేటర్ డా. ఆదెప్ప మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్తు శక్తి అని అన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ శక్తి, ప్రతిభను విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సామాజిక సేవ, దేశ నిర్మాణం వంటి సృజనాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రంజిత్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. సురేష్ కుమార్, అధ్యాపకులు డా. ఆదెప్ప, రవికుమార్, రమేష్, రుక్మిణి, హేమంత్, మహేందర్ రెడ్డి, రాజు, రాము తదితరులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.




