Choutakur: చౌటకూరు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం!
Choutakur: సంగారెడ్డి జిల్లా చౌటకూరు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు.
Choutakur: చౌటకూరు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం!
Choutakur: సంగారెడ్డి జిల్లా చౌటకూరు ప్రభుత్వ పాఠశాల వేదికగా విద్యా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మంచు లక్ష్మి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ‘టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్’ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా చౌటకూరు ప్రభుత్వ బడిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్‌ను మంచు లక్ష్మి స్వయంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ స్మార్ట్ తరగతి గది ప్రభుత్వ స్కూల్ వాతావరణాన్నే మార్చేసింది. పిల్లలను అమితంగా ఆకట్టుకునేలా గోడలపై రంగురంగుల పెయింటింగ్స్, నేలపై విదేశీ తరహా మ్యాటింగ్ సదుపాయాలను ట్రస్ట్ సమకూర్చింది. కేవలం మౌలిక వసతులే కాకుండా, ఆడియో-విజువల్ పద్ధతిలో పిల్లలు సులువుగా చదువుకునేలా పెద్ద స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీని, దానికి అనువైన ప్రొజెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం వెనుకబడిన ప్రాంతాలలోని ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసుకుని, వాటిని దత్తత తీసుకోవడం ద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేయడం తన లక్ష్యమని మంచు లక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ స్మార్ట్ ల్యాబ్స్ ద్వారా ప్రాథమిక పాఠశాల పిల్లలలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను, ఫోనిక్స్ మరియు రీడింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడమే టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఆడపిల్ల ఒక మంచు లక్ష్మిలా అవ్వాలి.డిజిటల్ లెర్నింగ్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో సమానంగా పోటీ పడగలరని ధీమా వ్యక్తం చేశారు.
సర్కారు బడుల మౌలిక స్వరూపాన్ని మారుస్తూ, పేద విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తున్న మంచు లక్ష్మి విద్యా యజ్ఞంపై స్థానిక ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి డిజిటల్ లాబ్స్ కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ప్రయత్నం నిజంగా అభినందనీయం.




