Toopran: కృష్ణాపూర్ గ్రామంలో సామరస్యంగా సమస్య పరిష్కారం.. ఫిర్యాదు ఉపసంహరణ!
Toopran: తూప్రాన్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో డప్పులు కొట్టడం, ఆలయ ప్రవేశ వివాదం సామరస్యంగా పరిష్కారమైంది. ఎస్సీ వర్గీయులు తమ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.
Toopran: కృష్ణాపూర్ గ్రామంలో సామరస్యంగా సమస్య పరిష్కారం.. ఫిర్యాదు ఉపసంహరణ!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో ఇటీవల బతుకమ్మ పండుగ సందర్భంగా డప్పులు కొట్టే విషయంలో, గ్రామంలోని ఆలయంలోకి ప్రవేశానికి సంబంధించి, అలాగే గ్రామ సర్పంచ్ భర్తపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తలెత్తిన వివాదాలపై రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి, ఇరువర్గాలతో చర్చలు జరిపి, గ్రామంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. గ్రామంలో ఎలాంటి కుల వివక్షకు, సామాజిక అసమానతలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో, పరస్పర గౌరవంతో జీవించాలని అధికారులు సూచించారు. గ్రామంలో శాంతి, సామరస్యం, సోదరభావం కొనసాగించేలా అందరూ సహకరించాలని కోరారు.
అధికారుల చొరవతో గ్రామస్థులతో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో సంబంధిత వివాదాలకు పరిష్కారం లభించింది.
ఈ నేపథ్యంలో గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసిన ఎస్సీ వర్గానికి చెందిన వారు, తమ సమస్యలు పరిష్కారమైనందున తాము ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.
అదేవిధంగా, సమస్యపై తక్షణమే స్పందించి గ్రామానికి వచ్చి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేసిన పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు ఫిర్యాదుదారులు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామాల్లో కుల వివక్షత, సామాజిక అసమానతలు తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, హక్కులు కల్పించేలా చూడడం, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీస్ మరియు రెవెన్యూ శాఖల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, ప్రజలందరూ పరస్పర గౌరవంతో మెలుగుతూ గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎసై గంగరాజు సూచించారు.




