Medak: ప్రమాదంలో రైతు తిరుపతి కిషన్ మృతి బాధాకరం..బీఆర్ఎస్ కంటారెడ్డి!
Medak: మెదక్‌లో ప్రమాదంలో రైతు తిరుపతి కిషన్ మృతి చెందడం బాధాకరమని, ఐకేపీ కేంద్రాలు తెరవకపోవడమే ఈ దుస్థితికి కారణమని బీఆర్ఎస్ నేత కంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు.
Medak: ప్రమాదంలో రైతు తిరుపతి కిషన్ మృతి బాధాకరం..బీఆర్ఎస్ కంటారెడ్డి!
Medak: ఔరంగాబాద్‌కు చెందిన రైతు తిరుపతి కిషన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర బాధాకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న ఆయన బుధవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న తిరుపతి కిషన్ మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతు మంగళవారం రాత్రి తన పొలం వద్ద కోసి ఉంచిన వరి ధాన్యం వద్దకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు.
ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఉంటే రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసే పరిస్థితి వచ్చేది కాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకునే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే పంటలు కోసి ధాన్యాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఐకేపీ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రమాదం జరిగిన వెంటనే తిరుపతి కిషన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చామని, ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేదని, సకాలంలో వైద్యం అందించి సీపీఆర్ చేసి ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై తిరుపతిరెడ్డి విధుల్లో ఉన్న వైద్యురాలిని కలిసి వివరణ కోరారు.
రోగిని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే పల్స్ లేదని వైద్యురాలు తెలిపినట్లు పేర్కొన్నారు.అనంతరం విద్యుత్ శాఖ అధికారి మోహన్‌బాబును ఆసుపత్రికి పిలిపించి విద్యుత్ సరఫరాపై ఆరా తీశారు. ఆసుపత్రికి విద్యుత్ సరఫరా ఉందని, ఆసుపత్రి సిబ్బందే విద్యుత్ నిలిపివేశారని అధికారి తెలిపినట్లు తిరుపతిరెడ్డి వెల్లడించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడని ఆయన ప్రశ్నించారు.
రాత్రి వేళల్లో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ వైద్యం అందించేలా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్యుల విధుల నిర్వహణను పర్యవేక్షించాలని కోరారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెంటనే గుర్తించి, సంబంధిత వాహనదారుడు, డ్రైవర్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతును కోల్పోవడం బాధాకరమని, ఇప్పటికే తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
మృతుడి కుటుంబానికి తక్షణమే తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, మాజీ కౌన్సిలర్ బిమరి కిషోర్, నాయకులు చంద్రమోహన్ గౌడ్, గంజి నవీన్, సతీష్ రావు, ఔరంగాబాద్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




