Andole: అందోల్‌లో పొలిటికల్ హీట్

Andole: అందోల్‌లో పొలిటికల్ టెన్షన్ పీక్స్. చౌటకూరులో మంత్రి కాంగ్రెస్ అలయ్ బలయ్, మునిపల్లిలో క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ అలయ్ బలయ్. ఒకే రోజు, ఒకే సమయానికి రచ్చ.

UMASHANKAR, ANDOLE
Published on: 21 Oct 2026 5:11 PM IST
Andole
X

Andole: అందోల్‌లో పొలిటికల్ హీట్

అందోల్: దసరా పండుగ వేళ అందోల్ నియోజకవర్గంలో పొలిటికల్ టెన్షన్ పీక్స్‌కు చేరింది! నియోజకవర్గ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ‘ఢీ అంటే ఢీ’ అంటున్నాయి. ఒకే రోజు.. ఒకే సమయానికి ఇరు పార్టీల అగ్రనేతలు పోటాపోటీగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాలకు తెరలేపారు. ఒకవైపు చౌటకూరు మండలంలో ఆరోగ్య శాఖ మంత్రి హవా.. మరోవైపు మునిపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సవాల్! రెండు వేర్వేరు మండలాల్లో ఒకే ముహూర్తానికి జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు నియోజకవర్గంలో దావాగ్నిలా రాజుకుంది. పండుగ పూట తలపడుతున్న ఇరు పార్టీల వ్యూహాలు ఏంటి? అసలు అందోల్‌లో ఏం జరగబోతోంది?

అందోల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసిన జోష్‌లో.. దసరా పండుగ సాక్షిగా తన పట్టును మరింత బిగించేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. చౌటకూరు మండలంలో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని తలపెట్టాయి. స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ వేడుక జరగబోతోంది. చౌటకూరు మండలం తాడ్ ధన్ పల్లి పరిధిలోని ఎమ్. ఎస్ (M. S) ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు హస్తం శ్రేణులు రణభేరి మోగించనున్నాయి. మంత్రి రాకతో నియోజకవర్గంలో కాంగ్రెస్ మైలేజ్ పెంచడమే లక్ష్యంగా గులాబీ కోట బద్దలు కొట్టేలా స్కెచ్ వేశారు!

అయితే, అధికార పార్టీకి అంత ఈజీగా స్పేస్ ఇచ్చే ప్రసక్తే లేదంటోంది గులాబీ దళం! కాంగ్రెస్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా.. అదే రోజు, అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కౌంటర్ ప్లాన్ చేశారు. మునిపల్లి మండలం బుసరెడ్డి పల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 11 గంటలకే పొటాపోటీగా బీఆర్ఎస్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తన పాత క్యాడర్ చెల్లాచెదురు కాలేదని, నియోజకవర్గంలో తన హవా ఇంకా తగ్గలేదని నిరూపించేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు క్రాంతి కిరణ్ మునిపల్లి వేదికగా ఈ సవాల్‌ను విసిరారు!

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. మండలాలు వేరైనా, సమయం మాత్రం ఒక్కటే! శుక్రవారం ఉదయం 11 గంటలకే ఇరు వర్గాలు భారీ ఎత్తున జన సమీకరణకు స్కెచ్ వేశాయి. ఒకవైపు చౌటకూరు మండలంలో మంత్రి వర్గం, మరోవైపు మునిపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే వర్గం బలప్రదర్శనకు దిగుతుండటంతో అందోల్ నియోజకవర్గంలో ‘నువ్వా-నేనా’ అనే రేంజ్‌లో పొలిటికల్ రచ్చ నడుస్తోంది. ఈ పొటాపోటీ అలయ్ బలయ్ పండుగ పూట ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE