Ameenpur: 12 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం!
Ameenpur: అమీన్పూర్ పీఎస్ పరిధిలో రెండేళ్ల చిన్నారి అక్షిత కిడ్నాప్ కేసును 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు మెదక్ జిల్లా నర్క్షెడ్లో రక్షించి గంగామణిని అదుపులోకి తీసుకున్నారు.
Ameenpur: 12 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం!
అమీన్పూర్: అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసు వివరాలను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
అమీన్పూర్లో నివాసం ఉంటూ సమీపంలోని హోటళ్లలో పనిచేస్తున్న ఎరుకల సరిత అనే మహిళ తన రెండేళ్ల కుమార్తె అక్షిత కనిపించకుండా పోయిందని ఈ నెల 18న అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు, చిన్నారి ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితురాలి కదలికలను గుర్తించిన పోలీసులు, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో మెదక్ జిల్లాలోని నర్క్షెడ్ గ్రామంలో చిన్నారి అక్షితను సురక్షితంగా గుర్తించి రక్షించారు. నిజాంసాగర్‌కు చెందిన గంగామణి (44) అనే మహిళ చిన్నారిని అపహరించినట్లు నిర్ధారించి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్, జూలై నెలల్లో జరిగిన రెండు కిడ్నాప్ కేసులను, అలాగే 2025లో ఐదు కిడ్నాప్ కేసులను తమ బృందాలు విజయవంతంగా పరిష్కరించాయని డీసీపీ తెలిపారు.




