Sangareddy: 3 నిమిషాల ఆలస్యం.. సంగారెడ్డిలో ఎస్సై పరీక్ష కోల్పోయిన అభ్యర్థిని!
Sangareddy: సుల్తాన్పూర్ జేఎన్టీయూ కేంద్రంలో ట్రాఫిక్ జామ్ వల్ల 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పటాన్చెరు అభ్యర్థిని శ్రీదేవి ఎస్సై పరీక్ష రాయలేకపోయారు.
Sangareddy: 3 నిమిషాల ఆలస్యం.. సంగారెడ్డిలో ఎస్సై పరీక్ష కోల్పోయిన అభ్యర్థిని!
Sangareddy: తెలంగాణ వ్యాప్తంగా ఎస్సై పోలీస్ నియామక రాత పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది.
మొత్తం 528 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానుండగా, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే, నిబంధనల అమలులో అధికారులు ఏమాత్రం సడలింపు ఇవ్వలేదు. పరీక్ష సమయానికి కేవలం 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ అభ్యర్థినిని అధికారులు గేటు లోపలికి అనుమతించలేదు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాల కేంద్రంగా జరుగుతున్న ఎస్సై రాత పరీక్షకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
మొత్తం 528 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, ఉదయం నుంచే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అభ్యర్థులను లోపలికి పంపించారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం దగ్గరుండి పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా, పరీక్షా కేంద్రం వద్ద ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పటాన్చెరుకు చెందిన శ్రీదేవి అనే అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి కేవలం మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అప్పటికే సమయం మించిపోవడంతో గేటు వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు ఆమెను లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు.
పటాన్చెరు - సంగారెడ్డి మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడటం వల్లే తాను ఆలస్యమయ్యానని శ్రీదేవి అధికారులకు వివరించింది. నెలల తరబడి ఎంతో కష్టపడి పరీక్షకు సిద్ధమయ్యానని, కేవలం మూడు నిమిషాల ఆలస్యాన్ని మన్నించి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె అధికారులను కన్నీళ్లతో వేడుకుంది.
అయినప్పటికీ, బోర్డు నిబంధనల ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక శ్రీదేవి కన్నీటి పర్యంతమవుతూ, తీవ్ర నిరాశతో అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.




