Asifabad: చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లకు అరుదైన గౌరవం!
Asifabad: సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లు ఐదుగురికి WWF ఆధ్వర్యంలో శ్రీ ఎం. గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు లభించింది.
Asifabad: చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లకు అరుదైన గౌరవం!
Asifabad: అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లకు అరుదైన గౌరవం లభించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మాకిడి సెక్షన్‌కు చెందిన ఐదుగురు వాచర్లకు WWF (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్థ ఆధ్వర్యంలో శ్రీ ఎం. గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డును ప్రదానం చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చీలపల్లి బేస్ క్యాంప్‌కు చెందిన ఎండీ జకీ, డి. ప్రకాశ్, పి. పాండురంగ్, పి. శ్యామ్‌రావు, రవీందర్ అవార్డులను అందుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో క్షేత్రస్థాయిలో వాచర్లు అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ అవార్డు గ్రహీతలను అభినందించారు. కాగజ్‌నగర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య సైతం ఐదుగురు వాచర్ల సేవలను ప్రశంసించారు.
ఈ విజయం వెనుక మాకిడి ఫారెస్ట్ సెక్షన్ అధికారి వి. మోహన్‌రావు మార్గదర్శకత్వం, నిరంతర పర్యవేక్షణ కీలకంగా నిలిచాయని అటవీ అధికారులు పేర్కొన్నారు. వాచర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అటవీ సంరక్షణలో వారిని ప్రోత్సహించిన ఆయన కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా అటవీ అధికారి బాలామణి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య వి. మోహన్‌రావుతో పాటు అవార్డు అందుకున్న ఐదుగురు వాచర్లను అభినందించారు. క్షేత్రస్థాయిలో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు సేవలందిస్తున్న సిబ్బందికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అటవీ శాఖకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.




