Mancherial: పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా క్రమశిక్షణతో కష్టపడండి: కలెక్టర్

Mancherial: మంచిర్యాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించి మెటీరియల్ అందజేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 12 Nov 2026 9:08 PM IST
Mancherial
X

Mancherial: పోలీస్ ఉద్యోగాలే లక్ష్యంగా క్రమశిక్షణతో కష్టపడండి: కలెక్టర్

మంచిర్యాల: పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో నిరంతరం శ్రమించి లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఉద్యోగం సాధించడమే కాకుండా మెరిట్‌లో ఉత్తమ స్థానం సాధించేలా ప్రణాళికాబద్ధంగా చదవాలని పిలుపునిచ్చారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత నిపుణ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్‌లతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి వారి శిక్షణ, ప్రిపరేషన్ వివరాలను తెలుసుకున్నారు.

గత రెండు నెలలకు పైగా అభ్యర్థులు ఎంతో కష్టపడి శిక్షణ పొందుతున్నారని, సుమారు 400 మంది క్రమం తప్పకుండా హాజరవడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అనంతరం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని, తదుపరి నిర్వహించే శారీరక దృఢత్వ పరీక్షలకు కూడా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని తెలిపారు.

కేవలం కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకే పరిమితం కాకుండా అర్హతను బట్టి బ్యాంకింగ్, రైల్వే, డీఎస్సీ వంటి ఇతర పోటీ పరీక్షలకు కూడా సన్నద్ధం కావాలని సూచించారు. వివిధ పోటీ పరీక్షల్లో సబ్జెక్టులు, పరీక్షా విధానాల్లో సారూప్యత ఉంటుందని, ప్రస్తుతం పొందుతున్న శిక్షణ ఇతర ఉద్యోగాల సాధనకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ శిక్షణతో క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడే తత్వం, సామాజిక బాధ్యత వంటి లక్షణాలు అలవడతాయని తెలిపారు.

రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. శిక్షణ ప్రారంభమైనప్పటి నుంచి అభ్యర్థుల వస్త్రధారణ, ప్రవర్తన, సమయపాలన, క్రమశిక్షణలో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు. అభ్యర్థులు కేవలం ఉద్యోగం సాధించడమే కాకుండా మెరిట్ జాబితాలో అత్యుత్తమ స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. కానిస్టేబుల్ ఉద్యోగం కెరీర్‌కు ప్రారంభం మాత్రమేనని, విధుల్లో ప్రతిభ, అంకితభావం కనబరిస్తే భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడాలని, ఎదురయ్యే ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని సూచించారు. అభ్యర్థులకు విద్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసం, మంచి నడవడిక, క్రమశిక్షణను నేర్పిస్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సంపత్, శిక్షణ బృందం కృషిని అభినందించారు.

అనంతరం అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్‌ను కలెక్టర్, సీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సంపత్, పోలీస్ అధికారులు, శిక్షణ బృంద సభ్యులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.