Asifabad: పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకోం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Asifabad: కాగజ్‌నగర్‌లో పేదల ఇళ్లు కూల్చితే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని, సిరిసిల్క్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఖాళీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 9 Nov 2026 7:03 PM IST
Asifabad
X

Asifabad: పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకోం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగలు చేసుకోవాలని ఆర్భాటంగా ప్రచారం చేస్తూ.. మరోవైపు దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇళ్లను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ మండల పరిధిలోని సిరిసిల్క్, చింతగూడ, డాడానగర్, బలగాల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు జారీ చేస్తున్న నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాం కాలంలోనే ఏర్పాటైన సిరిసిల్క్ కంపెనీ 1985లో మూతపడిందని, అప్పటి నుంచి అక్కడి కార్మికులు, వారి కుటుంబాలు, ఇతర పేదలు నివాసముంటున్నారని తెలిపారు.

కంపెనీ మూతపడినప్పటి నుంచి కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆరోపించారు. ఒక్కొక్క కార్మికుడికి సుమారు రూ.4 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉండగా, కేవలం రూ.40 వేలతో సరిపెట్టారని పేర్కొన్నారు. వడ్డీతో కలిపి బకాయిలను లెక్కించి 4,800 మంది కార్మికులకు న్యాయం చేయాలని లిక్విడేటర్‌ను డిమాండ్ చేశారు.

దశాబ్దాలుగా అక్కడే నివాసముంటున్న ప్రజలు విద్యుత్ బిల్లులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పన్నులు చెల్లిస్తున్నారని, వారికి ఇంటి నంబర్లు కూడా ఉన్నాయని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. అలాంటి పేదల ఇళ్లను తొలగించడం అన్యాయమన్నారు. గతంలో ఎస్పీఎం కార్మికులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ భూములు చూపించి వారి ప్రయోజనాలను కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం లిక్విడేటర్‌కు మరోచోట భూమిని కేటాయించి, స్థానిక పేదలు యథావిధిగా అక్కడే నివసించేలా చూడాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యేలు దండె విఠల్, పాల్వాయి హరీష్ బాబు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు పేదలపై చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ పరిసరాల్లో, ఫోర్త్ సిటీలో ఉన్న వేలాది ఎకరాల భూముల్లో కనీసం పది ఎకరాలు లిక్విడేటర్‌కు కేటాయిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను తొలగించిన తరహాలో కాగజ్‌నగర్‌లోనూ బలప్రయోగానికి దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాగజ్‌నగర్‌లో ఒక్క ఇల్లు కూల్చినా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాటి ముందు పడుకుంటారని, తన ప్రాణం పోయినా పేదల ఇళ్లను కూల్చనివ్వబోనని స్పష్టం చేశారు.

అధికారులు తక్షణమే నోటీసులను ఉపసంహరించుకోకపోతే బాధిత కుటుంబాలన్నింటినీ సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ మహాధర్నా నిర్వహిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.