Ramagundam: బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా

Ramagundam: న్యాయం కోసం వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచాలని కోర్టు లైజనింగ్ అధికారులకు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 7 Nov 2026 3:19 PM IST
Ramagundam
X

Ramagundam: బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా

రామగుండం: పోలీస్ స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే బాధితులతో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది గౌరవప్రదంగా, సున్నితత్వంతో వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. బాధితులు ఇప్పటికే సమస్యలతో మానసిక ఆందోళనలో ఉంటారని, వారికి మరింత ఇబ్బంది కలిగించకుండా అండగా నిలవాలని అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశించారు. సాక్షుల హాజరు, సకాలంలో చార్జిషీట్ల దాఖలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం ద్వారా కేసుల విచారణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

పెండింగ్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి

కోర్టు సమన్లను సకాలంలో అందజేయడంతో పాటు వాటి వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని, మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న వారెంట్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రొక్లమేషన్ ఆదేశాలను కూడా సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

సాక్షుల రక్షణకు ప్రాధాన్యత

ఫిర్యాదుదారులు, బాధితులు, సాక్షులు నిర్ణీత తేదీల్లో కోర్టుకు హాజరయ్యేలా దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా కేసుల నిరూపణలో కీలకమని పేర్కొన్నారు. సాక్షుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, దర్యాప్తు నుంచి న్యాయస్థానంలో విచారణ వరకు ప్రతి ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

న్యాయ ప్రక్రియలో జాప్యం జరగకుండా సంబంధిత మేజిస్ట్రేట్‌లతో సమన్వయం చేసుకోవాలని, దర్యాప్తులో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, లోపాలకు తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

సమర్థవంతమైన సిబ్బందికి ప్రోత్సాహకాలు

కోర్టు విచారణలకు సంబంధిత అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. సమర్థవంతంగా పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడం, సాక్షులను రక్షించడం, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

అనంతరం పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులను సీపీ శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, వర్టికల్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, తాండూర్ సీఐ దేవయ్య, సీసీఆర్‌బీ ఎస్‌ఐలు ఉపేందర్, వినీత, సీసీ సందీప్, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.