Hyderabad: గిగ్ వర్కర్ల హక్కుల రక్షణకు చట్టం తెచ్చాం: మంత్రి వివేక్!

Hyderabad: తెలంగాణలో 6 లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమానికి చట్టం తెచ్చామని, 14న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీతో భారీ ర్యాలీ ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 11 Nov 2026 11:34 PM IST
Hyderabad
X

Hyderabad: గిగ్ వర్కర్ల హక్కుల రక్షణకు చట్టం తెచ్చాం: మంత్రి వివేక్!

హైదరాబాద్: గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్లు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నారని, అయితే వారికి కనీస సదుపాయాలు, భద్రత కొరవడుతున్నాయని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, పరిష్కారానికి గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

తెలంగాణ సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కనీస వేతనాల అమలుకు చర్యలు తీసుకుంటోందన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు న్యాయం చేయాలని ఆకాంక్షించారని గుర్తుచేశారు. ఆ దిశగా గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.

గిగ్ వర్కర్స్ చట్టం ఇప్పటికే పలు ప్రాంతాల్లో అమలవుతోందని, భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రి వెల్లడించారు. గిగ్ వర్కర్ల వివరాల నమోదు, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. శిల్పకళా వేదిక నుంచి హెచ్‌ఐసీసీ వరకు జరిగే ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు. యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న గిగ్ వర్కర్లంతా ర్యాలీలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.