Mancherial: రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులు!

Mancherial: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 18 Nov 2026 12:11 PM IST
mancherial
X

mancherial: రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులు!

Mancherial: ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాల కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు కేసుల విచారణలో జాప్యాన్ని నివారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ కొత్త జిల్లాలకు ప్రత్యేక కోర్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు.

గత సెప్టెంబర్‌ 22 తేదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాల నిరోధక చట్టాల అమలు, ముఖ్యంగా PCR, POA చట్టాల అమలు తీరు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, వాటి విచారణలో ఎదురవుతున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు ప్రవీణ్ తెలిపారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టులు అందుబాటులో ఉండటంతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, బాధితులకు సకాలంలో న్యాయం అందడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కమిషన్ తరఫున ప్రభుత్వానికి అందించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని వివరించారు. తాజాగా కొత్త జిల్లాలకు కూడా ప్రత్యేక కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు.

ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు అందుబాటులోకి రావడం వల్ల ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాల కేసుల విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని, బాధితులు న్యాయం కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుందని ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. కేసుల పరిష్కారంలో జాప్యం తగ్గడంతో పాటు బాధితులకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం కీలక ముందడుగు అని అన్నారు. కమిషన్ చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి రేణిగుంట్ల ప్రవీణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.