Mancherial: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: సీఈవో!
Mancherial: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
Mancherial: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: సీఈవో!
మంచిర్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్థానం కల్పించడంతో పాటు, సవరణలు, తొలగింపుల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు, తొలగింపుల కోసం ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను వేగంగా పరిశీలించి పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రతి ఓటరుకు సంబంధించి కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




