Mancherial: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: మంచిర్యాల కలెక్టర్

Mancherial: జాతీయ రహదారి-363పై స్పీడ్ గన్లు ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 27 Oct 2026 7:30 PM IST
Mancherial
X

Mancherial: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: మంచిర్యాల కలెక్టర్

మంచిర్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. వాహనాల వేగ నియంత్రణ, రహదారులపై ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు, జాతీయ రహదారుల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఆక్రమణలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జాతీయ రహదారి-363పై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారులపై తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రహదారులపై పశువుల సంచారం వల్ల ప్రమాదాలు జరగకుండా గోశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల లైసెన్సుల సస్పెన్షన్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఫిట్‌నెస్ లేని వాహనాలను నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలపై జరిమానాలు విధించాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రహదారులపై పార్కింగ్‌ను నియంత్రించాలి

మున్సిపాలిటీల పరిధిలో భవనాల సెల్లార్లను పార్కింగ్ అవసరాలకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రహదారులపై వాహనాల పార్కింగ్‌ను నియంత్రించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.