Mancherial: మంచిర్యాల, దండేపల్లి ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

Mancherial: మంచిర్యాల, దండేపల్లి ఘటనలపై విచారణకు సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Oct 2026 2:21 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల, దండేపల్లి ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

మంచిర్యాల: మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు.

ఈ ఘటనలకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసే లక్ష్యంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. ఇందులో భాగంగా సంఘటన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు సంబంధిత వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులను విచారించనుంది. సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషించడం ద్వారా ఘటనల వెనుక ఉన్న వాస్తవాలు, సంబంధిత వ్యక్తుల పాత్రను నిష్పక్షపాతంగా నిర్ధారించనుంది.

మరోవైపు మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఊహాజనిత, నిర్ధారణ కాని, అసత్య సమాచారాన్ని నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు. అలాంటి ప్రచారాల వల్ల అనవసర ఆందోళనకు గురికావద్దని, పోలీస్ శాఖ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాలని కోరారు.

ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని, శాంతిభద్రతల పరిరక్షణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కట్టుబడి ఉందని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.