Sirpur: కౌటాల 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే!

Sirpur: కౌటాల విద్యుత్ సబ్ స్టేషన్‌ను పరిశీలించిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్, లేకుంటే ఆందోళన హెచ్చరిక.

SRINIVAS, KOUTALA
Published on: 29 Sept 2026 9:56 PM IST
Sirpur
X

Sirpur: కౌటాల 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే!

సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని 33/11 కె.వి సబ్ స్టేషన్ ను సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ లాగ్ బుక్కులు పరిశీలించి ఏడీఈ మరియు ఇంచార్జ్ ఏఈ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కౌటాల మండలంలో దాదాపు ఐదు వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారని, రోజుకు మధ్యాహ్నం పూట 5 నుంచి 7 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నారు. దీంతో మిర్చి పంట ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని నిరంతరాయంగా 12 గంటలు విద్యుత్ సరఫరా.చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

గృహ అవసరాలకు కూడా సాయంకాలం పూట ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అప్రకటిత కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని జనవరి, ఫిబ్రవరిలోనే తెలిసినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు.

ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు నిండుకుందని, మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు సరఫరా లేక ఉత్పత్తి తగ్గిందని, దీంతో సాయంకాలం, రాత్రిపూట తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. కేవలం సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరిగే మధ్యాహ్నం సమయంలో మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఆరోపించారు.

పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసైనా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మిర్చి మరియు వరి రైతులను విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, పెద్ద ఎత్తున రైతులతో కలిసి సబ్ స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA