Singareni: నైనీ బొగ్గు ఎన్టీపీసీ కనిహా ప్లాంట్‌కు.. సరఫరాకు సింగరేణి సంసిద్ధం!

Singareni: ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఎన్టీపీసీ కనిహా ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేసేందుకు సిద్ధమని శుక్రవారం సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 20 Nov 2026 6:36 PM IST
Singareni
X

Singareni: నైనీ బొగ్గు ఎన్టీపీసీ కనిహా ప్లాంట్‌కు.. సరఫరాకు సింగరేణి సంసిద్ధం!

Singareni: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును స్థానిక పరిశ్రమలతో పాటు ఎన్టీపీసీ కనిహా థర్మల్ విద్యుత్ కేంద్రానికి సరఫరా చేసేందుకు సింగరేణి కాలరీస్ సంస్థ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ, మిగిలిన బొగ్గును ఇతర అవసరాలకు వినియోగించుకునే దిశగా సింగరేణి ప్రణాళికలు రూపొందిస్తోంది.

న్యూఢిల్లీలో ఎన్టీపీసీ ఛైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్‌తో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైనీ బొగ్గు బ్లాక్‌లో జరుగుతున్న ఉత్పత్తి, భవిష్యత్ ప్రణాళికలు, బొగ్గు సరఫరా అవకాశాలపై చర్చించారు. సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణకు తొలి ప్రాధాన్యత ఇస్తూ నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గులో అధిక భాగాన్ని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సరఫరా చేస్తున్నామని సింగరేణి సీఎండీ తెలిపారు. మిగిలిన బొగ్గును స్థానిక పరిశ్రమలకు అందిస్తున్నామని వివరించారు. ఈ సరఫరాలకు అదనంగా ఒడిశాలోని ఎన్టీపీసీ కనిహా థర్మల్ ప్లాంట్‌కు కూడా బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

సింగరేణి సంస్థ తెలంగాణలోని ఎన్టీపీసీ ప్లాంట్లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలకు ఒప్పందాల ప్రకారం దశాబ్దాలుగా బొగ్గు సరఫరా చేస్తోంది. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో తెలంగాణ తర్వాత అత్యధికంగా ఎన్టీపీసీ ప్లాంట్లకే సరఫరా చేస్తున్నట్లు సీఎండీ పేర్కొన్నారు.

నైనీ బొగ్గు బ్లాక్ నుంచి వచ్చే ఏడాది నుంచి ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ బ్లాక్ నుంచి సుమారు నాలుగు దశాబ్దాల పాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగనుందని వివరించారు. భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరగనున్న నేపథ్యంలో సమీపంలోని ఎన్టీపీసీ కనిహా ప్లాంట్‌కు దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి ఆసక్తి చూపుతోంది.

సింగరేణి ప్రతిపాదనపై ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం తమ ప్లాంట్‌కు ఇతర ప్రభుత్వ బొగ్గు సంస్థల నుంచి బొగ్గు సరఫరా అవుతోందని, నైనీ బొగ్గు బ్లాక్ సమీపంలోనే ఉన్నందున అక్కడి నుంచి బొగ్గు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. దీంతో నైనీ బొగ్గు సరఫరా ద్వారా ఎన్టీపీసీతో సింగరేణి సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.