Mancherial: ఆదివాసీలపై అటవీ ఆంక్షలు ఎత్తివేయాలి: రౌండ్ టేబుల్
Mancherial: లక్షెట్టిపేటలో టైగర్ జోన్ బాధితుల పోరాట వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.
Mancherial: ఆదివాసీలపై అటవీ ఆంక్షలు ఎత్తివేయాలి: రౌండ్ టేబుల్
మంచిర్యాల: ఆదివాసీ పేదలపై అటవీశాఖ అధికారులు విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, దాడులను నిలిపివేయాలని టైగర్ జోన్ బాధితుల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. టైగర్ జోన్‌ను రద్దు చేయడంతో పాటు ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీ హక్కుల చట్టాన్ని సమర్థంగా అమలు చేయకుండా టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ పేరుతో అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ పేదల జీవనోపాధికి ఆటంకాలు కలిగించడం సరికాదన్నారు.
పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
అడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించడం వల్ల ఆదివాసీలు ఉపాధి కోల్పోతున్నారని నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం చేపట్టిన ఆదివాసీ రైతుల పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. అడవిలో పశువులు, మేకలను మేపుకునే కాపరులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలపై ఆంక్షలు, నిర్బంధ చర్యలు, దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలని, ప్రతి ఆదివాసీ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. గ్రామాలకు అవసరమైన రహదారులు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సూర్పటేల్, చిత్రు, కిష్టు, దుంపల రంజిత్ కుమార్, కనికరపు అశోక్, రెడ్డిమల్ల ప్రకాష్, ధమ్మా నారాయణ, మలేం చిన్నన్న, అవునూరి వెంకటేష్, ముల్కల్లా రాందాస్, సుధాకర్, గరిసే రవీందర్, తోగారి రాజు, భైరం లింగన్న, సత్తన్న, కళ్యాణం రవి తదితరులు పాల్గొన్నారు.




