Mancherial: మంచిర్యాలలో సహారా బాధితుల సమావేశం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి!
Mancherial: మంచిర్యాలలో సహారా బాధితుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా తమ డిపాజిట్లను ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
Mancherial: మంచిర్యాలలో సహారా బాధితుల సమావేశం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి!
Mancherial: కాయకష్టం చేసి, కూలినాలి చేస్తూ రేపటి భవిష్యత్తు కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు మరియు సొంతింటి కల కోసం దాచుకున్న ప్రతి రూపాయిని సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సహారా బాధితులు విజ్ఞప్తి చేశారు. రేపు కరీంనగర్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరుతూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సహారా బాధితుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సహారా బాధితుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా బాధితులకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల రిఫండ్ చెల్లించాల్సి ఉందని తెలిపారు. డిపాజిట్ల కాలపరిమితి ముగిసి 3 నుంచి 4 ఏళ్లు గడుస్తున్నా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఎంతోమంది బాధితులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే సహారా సంస్థలో పనిచేసిన 16 లక్షల మంది ఏజెంట్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిష్కరించాలని కోరారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరువ్యాపారులు, పేద మరియు మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును వెంటనే వడ్డీతో సహా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి ఈ తీవ్రమైన సమస్యను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు కోరారు. అనంతరం "సహారా బాధితుల ఐక్యత వర్ధిల్లాలి", "సహారా బాధితులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదుకోవాలి" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సహారా బాధితులు గజెల్లి వెంకటయ్య, పులి కృష్ణతో పాటు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రమేష్, మురహరి, ఆర్. రమేష్ లాల్ మరియు ఇతర బాధితులు పాల్గొన్నారు.




