Dharmaraopet: ధర్మారావుపేటలో కంది విత్తనోత్పత్తి సాంకేతికతలపై రైతులకు శిక్షణ!
Dharmaraopet: మంచిర్యాల జిల్లా ధర్మారావుపేట రైతు వేదికలో కేవీకే బెల్లంపల్లి ఆధ్వర్యంలో కంది విత్తనోత్పత్తి సాంకేతికతలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
Dharmaraopet: ధర్మారావుపేటలో కంది విత్తనోత్పత్తి సాంకేతికతలపై రైతులకు శిక్షణ!
Dharmaraopet: కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) బెల్లంపల్లి ఆధ్వర్యంలో ధర్మారావుపేట రైతు వేదికలో కంది విత్తనోత్పత్తి సాంకేతికతలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాబార్డ్ ఆర్థిక సహకారంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టులో భాగంగా ధర్మారావుపేట పీఏసీఎస్ రైతులకు ఈ శిక్షణ ఇచ్చారు.
కేవీకే బెల్లంపల్లి శాస్త్రవేత్త, హెడ్ (ఎఫ్‌ఏసీ) డా. ఎన్. మహేష్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనోత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రాజెక్టు లక్ష్యమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం–నాబార్డ్ సహకారంతో ప్రతి జిల్లాలో మూడు పీఏసీఎస్‌లను ఎంపిక చేసి, వాటి ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేలా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి పీఏసీఎస్‌లు అధిక కొనుగోలు ధరకు విత్తనాలను సేకరించి, శుద్ధి, ప్రాసెసింగ్, ప్యాకింగ్ అనంతరం రైతులకు విక్రయించే విధానం అమలు చేయనున్నట్లు వివరించారు. దీనివల్ల రైతులకు నాణ్యమైన విత్తనం అందుబాటులోకి రావడంతో పాటు పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కంది విత్తనోత్పత్తిలో అనువైన రకాల ఎంపిక, నాణ్యమైన విత్తన వనరు, భూమి తయారీ, విత్తన శుద్ధి, సరైన విత్తే సమయం, విత్తన మోతాదు, మొక్కల మధ్య దూరం, పోషక యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలు–తెగుళ్ల నియంత్రణ, ఐసోలేషన్ దూరం, రోగింగ్, సరైన పరిపక్వతలో కోత, నూర్పిడి, ఎండబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్, నిల్వ వంటి అంశాలపై డా. మహేష్ రైతులకు శాస్త్రీయంగా అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో జన్యు స్వచ్ఛత, భౌతిక నాణ్యతను కాపాడటం అత్యంత కీలకమని తెలిపారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ ధర్మారావుపేట చైర్మన్ శంకర్ గౌడ్, వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ దీప్తి, పీఏసీఎస్ సీఈఓ రాజేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. మొత్తం 41 మంది రైతులు శిక్షణలో పాల్గొని కంది విత్తనోత్పత్తికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
శిక్షణ కార్యక్రమం పట్ల రైతులు, పీఏసీఎస్ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చే ఏడాది పీఏసీఎస్ ఆధ్వర్యంలో కంది విత్తనోత్పత్తిని మరింత విస్తృత విస్తీర్ణంలో చేపట్టాలని కోరారు.




