Mancherial: బెల్లంపల్లిలో విధుల్లో నిర్లక్ష్యం.. 14 మంది పోలీసులపై చర్యలు!

Mancherial: బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న 14 మంది సిబ్బందిపై రామగుండం సీపీ చర్యలు తీసుకున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 18 Nov 2026 10:08 AM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లిలో విధుల్లో నిర్లక్ష్యం.. 14 మంది పోలీసులపై చర్యలు!

Mancherial: ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది డ్యూటీ సమయంలోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేసిన ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

విధి బాధ్యతలను విస్మరించి, పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.

ఈ ఘటనపై స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో తొమ్మిది మంది సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మొత్తం 14 మంది సిబ్బందిపై చర్యలు చేపట్టినట్లయింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సిబ్బందికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులే విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నిబద్ధతతో పనిచేస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘన, శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.