Mancherial: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంచిర్యాల కలెక్టర్
Mancherial: మంచిర్యాల ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
Mancherial: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంచిర్యాల కలెక్టర్
మంచిర్యాల: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు.
ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, చిన్నారుల చికిత్స విభాగం, ఐసీయూ గదులు, పడకలు, వైద్య పరికరాలు, ఏసీలు, మందుల లభ్యత, రికార్డులను తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, బరువు, వారికి అందిస్తున్న వైద్య సేవలపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్యం అందించాలని, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో అవసరమైన అదనపు సదుపాయాలు, వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని, మరమ్మతులకు గురైన పరికరాలు, ఇతర సదుపాయాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం సేవించి వచ్చి గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




