Mancherial: అలుగామలో గుడుంబా స్థావరాలపై దాడులు.. ముగ్గురిపై కేసులు నమోదు!
Mancherial: కోటపల్లి మండలం అలుగామలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
Mancherial: అలుగామలో గుడుంబా స్థావరాలపై దాడులు.. ముగ్గురిపై కేసులు నమోదు!
Mancherial: కోటపల్లి మండలం లోని అలుగామ గ్రామంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు.
చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో గుడుంబా తయారీ, విక్రయాలకు సంబంధించి దుర్గం స్వామి, దాగం రమేష్, దాగం గోపాల్‌పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి సుమారు 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ, గ్రామాల్లో ఎవరూ గుడుంబా తయారీకి పాల్పడవద్దని, గుడుంబా తయారు చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొద్దిపాటి ఆదాయం కోసం గుడుంబా తయారు చేసి ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవద్దని సూచించారు. గుడుంబా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాల్లో అశాంతి నెలకొంటోందని, పచ్చని కాపురాలు చిన్నాభిన్నమవుతున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా యువత గంజాయికి పూర్తిగా దూరంగా ఉండాలని, సరదా కోసం గంజాయి సేవించి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి విక్రయించినా, సేవించినా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్రామాల్లో గుడుంబా, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
అనంతరం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి, సరైన వాహన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, నిల్వాయి ఎస్ఐ నాగరాజు, ఎక్సైజ్ ఎస్ఐ సాయి, పోలీస్, ఎక్సైజ్ శాఖల సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.




