Mancherial: గంగిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన మంత్రి!

Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 25 Nov 2026 1:21 PM IST
Mancherial
X

Mancherial: గంగిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన మంత్రి!

Mancherial: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం లక్ష్యాలు, అర్హులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

అనంతరం గంగిపల్లి నుంచి ఎలకంటి మీదుగా రూ.1.50 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

అలాగే విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.